Informatics Educational Institutions & Programs
ఒక సంస్థకు (వాణిజ్య లేదా వాణిజ్యేతర) గాని, లేదా దాని ఉత్పత్తులు, సేవలకు గానీ ప్రత్యేకంగా ఒక వికీపీడియా పేజీ ఉండవచ్చా అనే అంశాన్ని నిర్ణయించడానికి ఈ పేజీ సహాయపడుతుంది. లాభాపేక్ష లేని విద్యా సంస్థలు, మతాలు, క్రీడా జట్లను మినహాయించి ఇతర సంస్థలకూ, ఒక ప్రయోజనం కోసం పనిచేసే వ్యక్తుల సమూహాలకూ ఈ మార్గదర్శకం వర్తిస్తుంది. ఏదైనా ఒక సమూహానికి వేరే నిర్దుష్ట ప్రాముఖ్యతా మార్గదర్శకాలు వర్తిస్తే ఈ మార్గదర్శకాన్ని పక్కనపెట్టవచ్చు.
సరళంగా చెప్పాలంటే, ఒక సంస్థ అనేది ఒక ప్రయోజనం కోసం ఏర్పడిన కొంతమంది వ్యక్తుల సమూహం. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆసక్తి సమూహాలు, సామాజిక క్లబ్‌లు, కంపెనీలు, భాగస్వామ్యాలు, యాజమాన్యాలు, లాభాపేక్షతో కూడిన విద్యా సంస్థలు లేదా సంస్థలు మొదలైన వాణిజ్య, వాణిజ్యేతర కార్యకలాపాలు జరిపేవన్నీ ఇందులో భాగమే.
ఈ మార్గదర్శకం కుటుంబాలు, వినోద సంబంధ సమూహాలు, సహరచయితలు, సహ ఆవిష్కర్తలు వంటి వాటికి వర్తించదు. వాటికి వికీపీడియా (వ్యక్తులు) వర్తిస్తుంది.
నిర్థారించదగిన సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు
ఏదైనా సంస్థ లేదా దాని ఉత్పత్తి దానికి సంబంధం లేని విశ్వసనీయమైన మూలాలను ఆకర్షించి ఉంటే ఆ సంస్థ లేదా ఉత్పత్తికి విషయ ప్రాముఖ్యత ఉందని వికీపీడియా భావిస్తుంది. ఈ మూలాలను వ్యాసంలో ఇంకా ఉల్లేఖించనప్పటికీ (చాలా సందర్భాలలో వాటిని జోడిస్తే వ్యాసానికి విలువ చేకూరుతుంది), అవి ప్రచురితమై ఉండడమే ఆవశ్యకం.
స్వాభావిక ప్రాముఖ్యత లేదు
ఏ సంస్థకైనా దానంతట అదే అంతర్లీనంగా ప్రాముఖ్యత ఉన్నట్లుగా పరిగణించరాదు. పాఠశాలలతో సహా అది ఏ రకమైన సంస్థ అయినా ఈ ఆవశ్యకత నుండి మినహాయింపు ఉండదు . [1] సంస్థకు స్వతంత్ర మూలాల నుండి ఎటువంటి కవరేజీ లేకపోయినా, లేదా చాలా తక్కువ కవరేజీ ఉన్నా, దానికి ప్రాముఖ్యత ఉనట్లుగా పరిగణుఇంచకూడదు. దాన్ని పోలిన ఇతర సంస్థలకు ప్రాముఖ్యత ఉన్నంత మాత్రాన, దీనికి ప్రాముఖ్యత ఉన్నట్లు కాదు. (క్రింద "విషయ ప్రాముఖ్యత లేకపోతే" చూడండి) . "ప్రాముఖ్యత" అనేది "కీర్తి" లేదా "ముఖ్యత"కు పర్యాయపదం కాదు. సంస్థ ఎంతో "ముఖ్యమైన"దని వ్యక్తిగతంగా విశ్వసించినా, సంస్థతో ఏ సంబంధమూ లేని విశ్వసనీయమైన మూలాల్లో దానికి గణనీయమైన కవరేజీ లేకపోతే వికీపీడియాలో దానికి పేజీ ఉండే అర్హత లేనట్లే.
సంస్థలు లేదా ఉత్పత్తుల ప్రాముఖ్యతను మూల్యాంకనం చేస్తున్నప్పుడు, సంస్కృతి, సమాజం, వినోదం, అథ్లెటిక్స్, ఆర్థిక వ్యవస్థలు, చరిత్ర, సాహిత్యం, సైన్స్ లేదా విద్యపై అవి ఏవైనా ముఖ్యమైన లేదా చెప్పుకోదగ్గ ప్రభావాలను కలిగించాయేమో పరిశీలించండి. పెద్ద సంస్థలకూ, వాటి ఉత్పత్తులకూ విషయ ప్రాముఖ్యతకు ఆధారాలను అందించే విశ్వసనీయ మూలాల నుండి సులభంగా అందుబాటులో ఉండే నిర్థారించుకోదగిన సమాచారం ఉంటుంది. అయితే, చిన్న సంస్థలకు, వారి ఉత్పత్తులకూ కూడా విషయ ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంది. చాలా చిన్న "గ్యారేజ్" సంస్థలు లేదా స్థానిక సంస్థల గురించిన వ్యాసాలు సాధారణంగా ప్రకటనాత్మకంగా ఉండి, ఆమోదయోగ్యంగా ఉండనప్పటికీ, పెద్ద సంస్థలు లేదా వాటి ఉత్పత్తులకు అనుకూలంగా ఉండే పక్షపాత, ఏకపక్ష ప్రమాణాలను ప్రాముఖ్యత కోసం ఉపయోగించకూడదు.
వారసత్వ ప్రాముఖ్యత ఉండదు
ఒక ప్రముఖ వ్యక్తి తోనో లేదా సంఘటన తోనో అనుబంధం ఉన్నంత మాత్రాన సంస్థకు ప్రాముఖ్యత రాదు. ఏదైనా సంస్థకు, విషయ ప్రాముఖ్యత గల సంస్థలు అనుబంధంగా ఉన్నంత మాత్రాన దానికి ప్రాముఖ్యత రాదు. సంస్థకు ప్రాముఖ్యత ఉన్నట్లుగా పరిగణించాలంటే, విశ్వసనీయమైన స్వతంత్ర వనరులలో దాని గురించి చర్చించి ఉండాలి. ఉదాహరణలు: ఒక ప్రముఖ వ్యక్తి ఒక రెస్టారెంట్‌ను కొనుగోలు చేస్తే, రెస్టారెంటుకు దాని యజమాని నుండి "వారసత్వంగా" ప్రాముఖ్యత రాదు. ఒక ప్రముఖ వ్యక్తి ఒక సంస్థలో చేరినట్లయితే, ఆ సంస్థ ఈ కొత్త ఉద్యోగి నుండి "వారసత్వంగా" ప్రాముఖ్యత పొందదు.
ఇది రెండో మార్గంలో కూడా పనిచేస్తుంది. ఒక సంస్థకు ప్రాముఖ్యత ఉండవచ్చు. కానీ అందులోని సభ్యులు (లేదా సభ్యుల సమూహాలు) వారి సభ్యత్వం కారణంగా ప్రాముఖ్యతను "వారసత్వం" పొందరు. ఒక సంస్థ గుర్తించదగినది కావచ్చు, కానీ దాని అనుబంధ సంస్థలు ఈ సంస్థ యాజమాన్యంలో ఉన్నాయి కాబట్టి ఆటోమాటిగ్గా "వారసత్వం" వచ్చేయదు.
ప్రాథమిక ప్రమాణాలు
ఒక కంపెనీ, కార్పొరేషన్, సంస్థ, సమూహం, ఉత్పత్తి లేదా సేవ కు, సదరు విషయానికి సంబంధం లేకుండా, అనేక విశ్వసనీయ ద్వితీయ స్థాయి మూలాల్లో, దానికి గణనీయమైన కవరేజీ వచ్చి ఉంటే దానికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లుగా భావించాలి.
ఈ ప్రమాణాలు, సాధారణంగా, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ నిపుణులు నియమాలను తమకు అనుకూలంగా మలచుకోడాన్ని నిరోధించడానికి, సదరు మూలాల నాణ్యతకు బలమైన ప్రాధాన్యత ఇస్తూ సాధారణ గుర్తింపు మార్గదర్శకాన్ని అనుసరిస్తాయి. ఈ మార్గదర్శకం, ఇతర విషయాలతోపాటు, ప్రకటనలు, ప్రచారం కోసం వికీపీడియాను దుర్వినియోగం చేయడం వంటి కొన్ని సాధారణ సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉద్దేశించబడింది. అందుకని, ఒక వ్యాసంలో రాసిన సమాచారానికి ఆమోదయోగ్యమైన మూలాల కంటే విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలకు సాధారణంగా ఉన్నత స్థాయి ఉండాలని వికి భావిస్తుంది.
ప్రమాణాలను ఎలా వర్తింపజేయాలి
మూలాలను తప్పనిసరిగా ఒకదానికొకటి విడిగా, స్వతంత్రంగా మూల్యాంకనం చేయాలి. విషయ ప్రాముఖ్యతను నిర్థారించడానికి తగు అర్హత మూలానికి ఉందో లేదో తెలుసుకోవడానికి కింది నాలుగు ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చూడాలి.
- వ్యాస విషయాన్ని నేరుగా, లోతుగా వివరించే ముఖ్యమైన కవరేజీ కలిగి ఉండాలి.
- వ్యాస విషయానికి మూలానికీ సంబంధం ఉండరాదు, పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి.
- నమ్మదగిన మూలం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
- ద్వితీయ స్థాయి మూలమై ఉండాలి; ప్రాథమిక, తృతీయ స్థాయి మూలాలు ప్రాముఖ్యతను నిర్థారించేందుకు పనికిరావు.
ఒక మూలజ్నికి విషయ ప్రాముఖ్యత ఉండాలంటే పై ప్రమాణాలన్నిటినీ సంతృప్తి పరచాలి. ప్రతి మూలం ముఖ్యమైనది, స్వతంత్రమైనది, విశ్వసనీయమైనది, ద్వితీయమైనదిగా ఉండాలి. అదనంగా, ప్రాముఖ్యతను నిర్థారించడానికి ఇలాంటి మూలాలు బహుళంగా కూడా ఉండాలి. మూలపు అనుకూలత సందేహాస్పదంగా ఉన్నట్లయితే, ప్రాముఖ్యతను స్థాపించడంలో భాగంగా సదరు మూలాన్ని మినహాయించడం మంచిది.
ఫలానా లిమిటెడ్ అనే సంస్థ గురించి రాసిన ఒక వ్యాసంలో నాలుగు మూలాలను ఉదహరించినట్లు ఊహించుకోండి: ఫలానా ఉత్పత్తితో పోల్చినప్పుడు ప్రత్యర్థి ఉత్పత్తిలో లేని లక్షణాన్ని ఎత్తిచూపుతూ ఈనాడులో ఒకే వాక్యంలో సంస్థ ప్రస్తావన వచ్చిన వ్యాసం; ఎకనామిక్ టైమ్స్ వారి అనుబంధ బ్లాగులో టైమ్స్ ఉద్యోగి కాని వ్యక్తి, ఫలానా లిమిటెడ్ గురించి రాసిన విస్తారమైన వ్యాసం; టెక్ ఔత్సాహికుల బ్లాగులో ఈ సంస్థ ఉత్పత్తి గురించి వచ్చిన సమీక్షా వ్యాసం; సంస్థ తమ పేటెంటును ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒక పోటీదారు వేసిన కోర్టు కేసు.విశ్లేషణ:
- ఈనాడు కథనం నమ్మదగినది, స్వతంత్రమైనది, ద్వితీయమైనది - కానీ ముఖ్యమైనది కాదు (మరొక కంపెనీ గురించిన కథనంలో ఒకే వాక్య ప్రస్తావన ఉండి, అంతే).
- ఎకనామిక్ టైమ్‌స్ బ్లాగులోని వ్యాసం ముఖ్యమైనది, ద్వితీయమైనది – కానీ స్వతంత్రమైనది లేదా నమ్మదగినది కాదు (అటువంటి చాలా వ్యాసాలు కంపెనీ-ప్రాయోజిత లేదా కంపెనీ మార్కెటింగ్ ప్రచురణల ఆధారంగా ఉంటాయి).
- టెక్ బ్లాగ్ సమీక్ష ముఖ్యమైనది, ద్వితీయమైనది – కానీ స్వతంత్రంగా ఉండకపోవచ్చు (బ్లాగు పోస్టులు తరచూ స్పాన్సర్ చేయబడతాయి), నమ్మదగినవి కాకపోవచ్చు (స్వయం-ప్రచురితమైన మూలాధారాలు సాధారణంగా విశ్వసనీయమైనవి కావు, అవి సబ్జెక్ట్-మేటర్ నిపుణులు వ్రాస్తే తప్ప ).
- కోర్టు ఫైలింగ్ ముఖ్యమైనది, నమ్మదగినది (అందులో కోర్టు రికార్డు అనేది చట్టపరమైన చర్య యొక్క ధృవీకరించబడిన ఖాతా) - కానీ ద్వితీయమైనది కాదు (కోర్ట్ ఫైలింగ్‌లు ప్రాథమిక మూలాలు), స్వతంత్రమైనవి కావు (అవి చట్టపరమైన చర్య కోసం వాది పక్షాలు రాసినవి. అంచేత వీటికి స్వార్థపరమైన ఆసక్తి ఉంటుంది).
అందువల్ల, ఫలానా లిమిటెడ్ సంస్థ ప్రాముఖ్యతను స్థాపించే బహుళ మూలాల సంగతి దేవుడెరుగు.., దానికి పనికొచ్చే మూలం ఒక్కటి కూడా వీటిలో లేదు.
పై ఉదాహరణ యొక్క విశ్లేషణను పట్టికలో కింది విధంగా చూపవచ్చు:
మూలం | గణనీయమైనదేనా? | స్వతంత్రమైందేనా? | విశ్వసనీయమైనదేనా? | ద్వితీయ స్థాయిదేనా? | నెగ్గిందా, తప్పిందా? | వివరాలు |
---|---|---|---|---|---|---|
ఈనాడు | మరొక కంపెనీ గురించిన కథనంలో ఒకే వాక్య ప్రస్తావన. | |||||
ఎకనామిక్ టైమ్‌స్ లో బ్లాగు పోస్టు | ఇలాంటి పోస్ట్‌లు చాలా వరకు కంపెనీ-స్పాన్సర్ చేయబడినవి, లేదా కంపెనీ మార్కెటింగ్ మెటీరియల్‌లపై ఆధారపడీ ఉంటాయి. | |||||
టెక్ బ్లాగులో పోస్టు | బ్లాగు పోస్టులు తరచూ స్పాన్సర్ చేయబడతాయి. పైగా, అవి స్వీయ-ప్రచురితమైన మూలాలు. సబ్జెక్ట్-మేటర్ నిపుణుడిచే వ్రాయబడితే తప్ప అవి నమ్మదగినవి కావు. | |||||
కోర్టు కేసు | కోర్టు కేసులు ప్రాథమిక మూలాలు. వారు నిజాయితీగా ఉంటారు. కానీ, కోర్టు కేసులో చేసే ఆరోపణలను, దాఖలు చేసే కంపెనీ (లేదా కోర్టులో దాని ప్రత్యర్థులు) రాస్తారు, కాబట్టి అవి స్వతంత్రంగా ఉండవు. | |||||
మొత్తం పనికొచ్చే మూలాలు | 0 | విషయ ప్రాముఖ్యత ఉండాలంటే ప్రమాణాలకు సరిపడే మూలాలు బహుళ సంఖ్యలో ఉండాలి
|
విషయ ప్రాముఖ్యత లేకపోతే
ఈ మార్గదర్శకం యొక్క ప్రమాణాలను వర్తించడంలో విఫలమైన సంస్థకు ప్రత్యేకంగా వ్యాసం పేజీ ఉండనప్పటికీ, కొన్ని షరతులకు లోబడి సంస్థ గురించిన సమాచారాన్ని వికీపీడియా లోని ఇతర వ్యాసాల్లో చేర్చవచ్చు.
సంస్థ గురించిన కంటెంట్‌ని సంబంధిత వ్యాసాలలో చేర్చవచ్చు:
- సదరు వ్యాసానికి సరిపడే స్థాయిలో వివరాలు, ప్రాముఖ్యత ఆ సంస్థకు ఉంటే;
- స్వీయ ప్రచారం కాకపోతే
- స్వతంత్ర మూలాల ద్వారా నిర్థారించదగ్గ సమాచారం మాత్రమే అయితే.
ఏదైనా నగరం, పట్టణం, గ్రామం, జిల్లాకు స్థానికంగా ఉన్న సంస్థల విషయంలో, పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కంటెంటును ఆ స్థలానికి సంబంధించిన వ్యాసాల్లో చేర్చవచ్చు. ఉదాహరణకు, ఒక చిన్న పట్టణం యొక్క చరిత్ర లేదా ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన వ్యాపార సంస్థ గురించి ఆ పట్టణ వ్యాసం లోని చరిత్ర లేదా ఆర్థిక వ్యవస్థ విభాగంలో వివరించవచ్చు.
మూలాలు
- ↑ But see also WP:SCHOOLOUTCOMES, especially for universities